Saturday, October 19, 2013

 

రాముని అవతారం

మొత్తం రామాయణాన్ని ఆరు నిమిషాల్లో ఎంత అందం గా చెప్పాడో కదా మహానుభావుడు అని మా నాన్నగారు నా  చిన్నతనాల్లో చెపితే ఏమో అనుకొనే వాడిని కాని ఇప్పుడు కొంచం ప్రశాంతంగా భూ కైలాస్ సినిమా లోని "రాముని అవతారం" పాట వింటే , నిజంగా సముద్రాల గారు ఎన్ని సార్లు రామ దర్శనం చేస్తే ఈ పాట రాయ గలిగాడో కదా అని అనిపించక మానదు.పార్వతి మాత శివ సాన్నిహిత్యానికి దూరం కావడం "విష్ణు" మాయ ప్రభావమే అని నారదుడు చెప్పగా "తనకు" కలిగిన కష్టం ఆ నారాయణనుకు కూడా కలగాలి అని శాప వచనం ఇచ్చిన సందర్భంలో, ఇదే ఒక మహత్తర లోక కళ్యాణంకు మార్గం అవుతుంది అని నారదుని భక్తా వేశం రామావతార గేయ రూపకంగా తీర్చి దిద్ద పడుతుంది

ఎవరైనా ఈ పాటని కుశాగ్రంగా వింటే అస్సలు ప్రారంభ వాక్యమే దగ్గరే చాల సేపు ఆగిపోక తప్పదు. "రాముని అవతారం రవి కుల సోముని అవతారం" అంటే సూర్య వంశానికి చంద్రుని వలే ప్రకాశిస్తాడు అని అర్ధం ఇస్తూ "శ్రీ రామ చంద్రుడు" నామాన్ని సార్ధకం చేస్తాడు కవి.
"దాశరధి గా శ్రీ కాంతుడు వెలియు
కౌసల్య సతి తపము ఫలించు 
జన్మింతురు సహా జాతులు మువ్వురు"

ఎన్ని విషయాలు ఈ మూడు ముక్కల్లొ... లక్ష్మీపతి కౌసల్యా దేవి తపం ఫలించే విధంగా దశరధుని కుమారుడుగా  జన్మించడం మరియు తన అంశ తోనే మరో ముగ్గురి కుమారులుగా  ఆవిర్భవించడం. చాల మందికి లక్ష్మణుడు "వాసుకి" అంశ అని, "భరతుడు" సుదర్శనం" యొక్క అంశ అని, "శత్రుజ్ఞుడు" శంకం యొక్క అంశ అని భావన ఉంటుంది. "సహజాతులు" అన్న ప్రయోగం ఎంత నేర్పుగా బహు ప్రయోజనాలకి వాడడం చూస్తే భాష మీద వాళ్లకి ఉన్న పట్టు ఆశ్చర్యం కలించక మానదు.
 "చదువులు నేరుచు మిష చేత 
చాపం దాలిచి చేత 
విశ్వామిత్రుని వెను వెంట
యాగం కావగ చనునంట"
"వెనువెంట", "చనునంట" ఇట్లాంటి పద ప్రయోగం ఇవ్వాల రేపు కన పడ్డం చాల అరుదు. ఒక్క చిన్న విషయం చెప్పడానికి చాట భరతం చెప్పడం చూస్తున్నాము, మరి ఇంత గహనమైన విషయం ఇంత పొదుపుగా చెప్పడం చూస్తే నాలాంటి వాళ్ళు ఎంత అయినా నేర్చుకోవాలి ఏమో. 
"అదిగో చూడుము బంగారు జింక 
మన్నై చనునయ్యో లంక 
హర నయనాగ్ని పరాంగన వంక 
అడిగిన మరణమే నీ కింక "
కధ అంతా బాగానే వెళుతోంది అనుకొంటుండగా మలుపు. ఆ మలుపు కి తగ్గట్టుగా పాట అప్పటి వరుకు ఉన్న బాణీ నించి ఒక కొత్త పంథా కనపడుతుంది. రాబోతున్న లంకా ప్రయాణం, పరంగన వంక దృష్టి  మరణానికి హేతువు అవుతోందని భవిష్య వాణి వినపడుతుంది ఈ చరణంలొ. 
"రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
వానర కుల పుంగవ హనుమా
ముద్రిక కాదిది భువన నిదానం
జీవన్ముక్తికి సోపానం"
రామాయణం లో ఎక్కడ హనుమ ప్రస్తావన ఉంటుందో అక్కడ మంగళం ఉండక తప్పదు. ఈ పాట లో కూడా "హనుమ" ప్రవేశం అంత మంగళం గాను ఉంటుంది. కాని, ఇక్కడ ఒక్క సందేహం రాక  మానదు. హనుమ లంక కి వెళ్ళడం "జీవన్ముక్తి" సోపానం ఎలా అవుతుంది అండీ ?? ఒక యోగిపుంగవుడు  ఆత్మ ఆవిష్కారం కోసం ప్రయత్నించే ఘట్టం "జీవన్ముక్తి" సోపానం కాక మరి ఇంక ఏమి అవుతున్దండీ?? ఇంకో కోణం లో, "సుందర" కాండ పారాయణ మోక్షదాయకం అని చెప్పకనే చెప్పారు.
 "రామ రామ జయ రామ రామ 
జయ రామ రామ రఘుకుల సోమా 
సీతాశోక వినాశనకారి
లంకా వైభవ సంహారి"
రామ నామ వైభవం, హనుమ విజయం, రావణ సంహారం, భక్త జన శోక వినాశనం...  ఇలా అన్నీ తాత్పర్యాలు ఈ "సముద్రాల" వారి లఘు రామాయణం లో ప్రతిబింబిస్తాయి. ఇంతటి చక్కటి రామ కావ్య పద్యాన్ని తెలుగు జాతి అందించి అయన చరితకి కూడా అమరత్వాన్ని ఆపాదించు కొన్నారు అంటే అతిశయోక్తి కాదేమో.
 
రాముడిని కొలిచి, తలిచి తరించిన వాళ్ళు ఎందరో.  రాముడిని కొలిస్తే "రాముడి" లా మాట్లాడగలుగుతారు అట. "రాముడి" లా ప్రవర్తన ఉంటుంది అట. "రాముడిని కొలిస్తే రాముడి లా అవుతారు అట". ఈ పాట రాయ గలిగారు అంటే ఎంత సాధన చేయ గలిగారో కదా అని నాకు అనిపిస్తోంది. చాల చదువులు చదివిన వాళ్లకి చాల విద్యలు వస్తాయి. కాని కొన్ని సామాన్యమైన విషయాలు కూడా మరుస్తారు. ఉదాహరణకి, ఎవరైనా ఎదురు అయితే వాళ్ళు పలకరించే వరకు వీళ్ళు మాటలాడరు. "రాముడి" ని సేవించి "రాముడి" లాగ మారిన పుణ్యా త్ములకి ప్రపంచంలో చాల విషయాలు తెలియక పోవచ్చేమో కాని చక్కటి మాట మాట్లాడడం ప్రయోగించడం తెలుస్తుంది అనుకొంటా.

No comments:

Post a Comment